దిల్లీ: రాజస్థాన్ (Rajasthan) కరౌలీ పట్టణంలోని ఓ ఎస్‌బీఐ (SBI) శాఖలో రూ.11కోట్ల విలువైన నాణేలు (Coins) అదృశ్యమైన వ్యవహారంలో సీబీఐ (CBI) రంగంలోకి దిగింది.
దేశవ్యాప్తంగా 25చోట్ల సోదాలు నిర్వహించింది. దిల్లీతో పాటు జైపూర్, దౌసా, కరౌలి, సవాయి మధోపూర్, అల్వార్, ఉదయ్‌పూర్, భిల్వారాలోని దాదాపు 15మంది మాజీ బ్యాంకు ఉద్యోగులు, ఇతరులకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరిపినట్టు అధికారులు వెల్లడించారు. గతేడాది ఆగస్టులో కరౌలి జిల్లా మెహందీపూర్ బాలాజీ బ్రాంచ్‌లో నగదు నిల్వలో తేడా ఉన్నట్టు ప్రాథమికంగా తేలడంతో అధికారులు లెక్కింపు చేపట్టగా.. రూ.11కోట్ల విలువ చేసే నాణేలు అదృశ్యమైన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అప్రమత్తమైన బ్యాంకు సిబ్బంది తమ ఖాతా పుస్తకాల్లో రూ.13కోట్లుగా పేర్కొన్న ఈ నాణేల లెక్కింపు బాధ్యతను జైపూర్‌కు చెందిన అర్పిత్ గూడ్స్ క్యారియర్ అనే ప్రైవేటు సంస్థకు అప్పగించారు.