కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శుభవార్త చెప్పింది.
భక్తులు ఎదురు చూస్తున్న సెప్టెంబర్ నెల అంగప్రదక్షిణ టోకెన్లను (Tockens) ఈ నెల 22న విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఉదయం 9 గంటలకల్లా ఆన్‌లైన్ (Online)లో టోకెన్లు అందుబాటులో ఉంచనున్నట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు. తిరుమల (Tirumala) శ్రీవారి భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని.. కేవలం అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు.
అయితే సెప్టెంబర్ నెలలో బ్రహ్మోత్సవ తారీఖులైన 27-30 వరకు అంగప్రదక్షిణం టోకెన్లను రద్దు చేశామని టీటీడీ పేర్కొంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి తదనగుణంగా అంగ ప్రదక్షిణం టోకెన్లను ఆన్‌లైన్లో బుక్ చేసుకోవాల్సిందిగా సూచించింది. ఈ రోజుల్లో కేవలం సామాన్య భక్తులకే ప్రాధాన్యమిస్తామని, సర్వదర్శనం మాత్రమే అమలులో ఉంటుందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాలు జరిగే తేదీల్లో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను నిలిపివేస్తున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: జగన్ సొంత జిల్లాలో 175 రైతు ఆత్మహత్యలు.. జనసేన సంచలన రిపోర్ట్
ఇటీవల తిరుమల దర్శనాలు ఏర్పాటు చేస్తామని చెప్పి భక్తులను మోసగిస్తున్న దళారుల బెడద ఎక్కువైంది. తాజాగా భక్తుకు మోసగిస్తున్న దళారి రాజు అనే వ్యక్తిపై విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆరు వీఐపీ బ్రేక్ దర్శనాలు, సుప్రభాత సేవా టికెట్ల కోసం దళారి రాజు 86,500 వసూలు చేశాడని.. ఎలాంటి టికెట్లు ఏర్పాటు చేయకపోగా డబ్బులు తిరిగివ్వకపోవడంతో మోహన్ కుమార్ గుప్తా అనే భక్తుడు విజిలెన్స్ అధికారులను ఆశ్రయించాడు. భక్తుడు ఫిర్యాదుతో విజిలెన్స్ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు.
అదేవిధంగా.. సుప్రభాత సేవా టికెట్లు ఇప్పిస్తానని బెంగళూరుకు చెందిన భక్తులను దళారి పవన్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి మోసం చేసినట్లు మరో ఫిర్యాదు అందింది. రెండు సుప్రభాత సేవా టికెట్లకు భక్తుడు కిరణ్ దేశ్ పాండే వద్ద రూ. 8 వేలు వసూలు చేసి.. టికెట్లు ఇప్పించకపోవడంతో భక్తుడు విజిలెన్స్ అధికారుల దృష్టికి తీసుకొచ్చాడు. భక్తుడి ఫిర్యాదుపై పోలీసులకు సమాచారం అందించినట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు.