KTR On Bilkis Bano Case : గుజరాత్ మహిళ బిల్కిస్ బానో అత్యాచార కేసు నిందితులను పంద్రాగస్టు రోజున విడుదల చేయడంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మరోసారి తీవ్రంగా స్పందించారు.

అత్యాచార కేసు నిందితులను విడుదల చేయడం దేశ మనస్సాక్షికి మాయని మచ్చ అని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. విడుదలైన రేపిస్టులకు పూలదండలు వేసి యుద్ధవీరులు, స్వాతంత్ర్య సమరయోధులలాగా సన్మానించడం ఏంటని కేటీఆర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇప్పుడు బిల్కిస్ బానోకు జరిగిందే రేపు ఇంకెవరికైనా జరుగుతుంది గుర్తుంచుకోండి అని హెచ్చరిస్తూ ట్వీట్ చేశారు కేటీఆర్.

‘బానో కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న దోషులను విడుదల చేయడం మన దేశ మనస్సాక్షికి మచ్చ. రేపిస్టులకు పూలమాలలు వేసి వారిని యుద్ధ వీరులుగా, స్వాతంత్ర్య సమరయోధులుగా పరిగణిస్తున్నారు. గుర్తుంచుకోండి.. ఇవాళ బిల్కిస్ బానోకు ఏం జరిగిందే.. రేపు మనలో ఎవరికైనా జరగొచ్చు’ అని ట్వీట్‌ చేశారు కేటీఆర్.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్‌ బానో సామూహిక లైంగిక దాడి కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న 11 మంది దోషులను గుజరాత్‌ ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవం నాడు విడుదల చేయడం తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.

2002లో గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానో అనే ఐదు నెలల గర్భిణిపై కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడటంతో పాటు ఆమె కుటుంబంలోని ఏడుగురిని దారుణంగా హత్య చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసులో న్యాయస్థానం 11 మందిని దోషులుగా గుర్తించి 14 ఏళ్ల జైలుశిక్ష విధించింది. అయితే 75వ స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో ఆ దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడం వివాదానికి దారితీసింది. దేశ స్వాతంత్య్ర వజ్రోత్సవాల సమయంలో రేపిస్టులను ఎలా విడుదల చేస్తారని నెటిజన్లు, మహిళా సంఘాలు నిలదీస్తున్నాయి. అయితే ఈ నిర్ణయాన్ని గుజరాత్ ప్రభుత్వం సమర్ధించుకుంది. 1992 నాటి రెమిషన్ విధానం ప్రకారమే ఖైదీలను విడుదల చేశామని.. దీనిపై రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *