అమరావతి: సీపీఎస్‌పై ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల చర్చలు మరోసారి విఫలమయ్యాయి. చర్చలకు పిలిచిన ప్రభుత్వం మళ్లీ పాతపాటే పాడిందని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపించారు.
ఉద్యోగులకు సీపీఎస్ అనేది ఎంత ప్రమాదకరమో ప్రభుత్వం ప్రతిపాదించిన జీపీఎస్ అంతకుమించి ప్రమాదకరమని ఏపీ సీపీఎస్ ఉద్యోగ సంఘం నేతలు తెలిపారు. ఈ అంశాన్ని సంప్రదింపుల కమిటీకి తెలియజేశామన్నారు. ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగి రాజ్యాంగబద్ధ హక్కుగా పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సెప్టెంబరు1న నిర్వహించ తలపెట్టిన చలో విజయవాడ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఓపీఎస్ పునరుద్ధరించాలన్నదే ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్ అని స్పష్టం చేశారు. సీపీఎస్ విధానంలో వచ్చిన ఏ సవరణనూ ఈ రాష్ట్రంలో అమలు చేయడంలేదని పేర్కొన్నారు. జీపీఎస్ అమలైతే దాని పరిస్థితి కూడా అలాగే ఉంటుందన్నారు. చలో విజయవాడ కార్యక్రమం విజయవంతం చేయడం ద్వారా తమ వేదనను ప్రభుత్వానికి మరోసారి తెలియజేస్తామన్నారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరణ చేసే వరకు తమ పోరాటం ఆగదని తేల్చి చెప్పారు.