హైదరాబాద్: రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధి కోసం ఉప్పల్ స్టేడియం తరహాలో మరో అధునాతన అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అధికారులను ఆదేశించారు. ఇతర రాష్ట్రాల మాదిరే తెలంగాణలో అంతర్జాతీయ క్రీడామైదానాల ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందన్నారు. క్రికెట్ క్రీడా సౌకర్యాలు, వనరులను మరింత విస్తరించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో క్రికెట్ క్రీడాభివృద్ధి, హైదరాబాద్ క్రికెట్ సంఘంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘‘ రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధిలో భాగంగా 33 జిల్లాల్లోనూ కలెక్టర్ల అధ్యక్షతన క్రికెట్ క్రీడా సంఘాలు ఏర్పాటు చేయాలి. జీహెచ్‌ఎంసీతో పాటు 13 నగర పాలక సంస్థల్లో హెచ్‌సీఏకు అనుబంధంగా క్రికెట్ క్లబ్‌లు స్థాపించాలి. రాష్ట్రంలోని అన్ని క్రికెట్ క్లబ్‌లను హైదరాబాద్ క్రికెట్ సంఘానికి అనుసంధానం చేసి.. శిక్షణ, ఇతర వసతులు కల్పించాలి’’ అని మంత్రి ఆదేశించారు.