కుటుంబ సభ్యులు నిర్లక్ష్యం చేయడంతో పదిరోజులుగా చెట్టు కింద ఉంటున్న ముద్దం భవాని (53) ని స్థానికులు సహృదయ అనాధ వృద్ధాశ్రమం లో చేర్చిన సంఘటన తెలుసుకున్న పారా లీగల్ వాలంటీర్లు కొడారి వెంకటేష్,కానుగంటి శ్రీశైలం లు స్పందించి ముద్దం భవాని ని తిరిగి ఇంటికి చేర్చిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే భువనగిరి మున్సిపల్ పరిధిలోని రాయగిరి లో ముద్దం భవాని,గత కొంత కాలంగా కుటుంబ సభ్యులతో గొడవపడి గత పదిరోజులుగా ఇంటి సమీపంలో ఉన్న చెట్టు కింద ఉంటున్నాడు. ఇరుగుపొరుగు వారు పెట్టిన ఆహారం తింటూ, రాత్రి పూట కూడా చెట్టు కిందనే పడుకొంటున్నాడు. ఇది గమనించిన స్థానిక యువకులు ముద్దం భవాని ని సహృదయ అనాధ వృద్ధాశ్రమం లో శుక్రవారం చేర్పించారు. విషయం తెలుసుకున్న పారా లీగల్ వాలంటీర్లు కొడారి వెంకటేష్, కానుగంటి శ్రీశైలం లు శుక్రవారం సహృదయ అనాధ వృద్ధాశ్రమం కు వెళ్లి భవాని తో మాట్లాడి విషయాలు తెలుసుకున్నారు. ముద్దం భవాని కుమారుడైన ముద్దం మణికంఠ ను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. మణికంఠ తన తప్పుని ఒప్పుకుని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తానని,తన తండ్రి అయిన ముద్దం భవాని ని మంచిగా చూసుకుంటానని చెప్పి తండ్రి ని ఇంటికి తీసుకెళ్ళాడు. సమస్య పరిష్కారం కావడంతో స్థానికులు బోయిని నర్సింహ, మహేష్, శ్రీశైలం,చక్రి, సహృదయ అనాధ వృద్ధాశ్రమం నిర్వాహకురాలు యాకూబ్ మీ చోటు,కో- ఆర్డినేటర్ ఆఫ్రీన్ పర్వేజ్ లు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పారా లీగల్ వాలంటీర్ కొడారి వెంకటేష్ మాట్లాడుతూ తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత పూర్తిగా పిల్లలదే అని ఆయన అన్నారు. భవిష్యత్తులో ముద్దం భవాని ని మంచిగా చూడకుంటే , సకాలంలో భోజనం ఇవ్వకుంటే, భవాని కుటుంబ సభ్యుల పై కేసు నమోదు చేయిస్తానని ఆయన హెచ్చరించారు.