తిరుమల, B6 న్యూస్ :
శ్రీవారి ఫిక్స్‌డ్ డిపాజిట్ల విషయంలో వస్తున్న వదంతులను నమ్మవద్దని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) స్పష్టం చేసింది.
టీటీడీ బోర్డు ఆమోదించిన విధివిధానాల ప్రకారమే బ్యాంకుట్లో డిపాజిట్లు చేసినట్లు టీటీడీ పేర్కొంది. ఈ మేరకు శ్రీవారి ఆస్తులకు సంబంధించి శనివారం శ్వేతపత్రం విడుదల చేసింది టీటీడీ. దీనిలో భాగంగా శ్రీవారికి మొత్తం బ్యాంకుల్లో రూ. 15, 938 కోట్ల డిపాజిట్లు ఉన్నట్లు తెలిపిన టీటీడీ.. శ్రీవారికి 10,258.37 కేజీల బంగారం ఉన్నట్లు పేర్కొంది. 24 జాతీయ బ్యాంకుల్లో నగదు డిపాజిట్ చేసినట్లు టీటీడీ తెలిపింది. గత మూడేళ్లలో స్వామి వారి నగదు, డిపాజిట్లు భారీగా పెరిగినట్లు తెలిపింది టీటీడీ.
వైవి.సుబ్బారెడ్డి నేతృత్వంలోని టిటిడి ధర్మకర్తల మండలి 2019 నుండి పెట్టుబడి మార్గదర్శకాలను మరింత బలోపేతం చేసింది. టిటిడి ఛైర్మన్, బోర్డు టిటిడి నిధులను భారత ప్రభుత్వ సెక్యూరిటీలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నారని గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపించాయి. ఇవి పూర్తిగా అవాస్తవం. ఈ ప్రచారాన్ని టిటిడి తీవ్రంగా ఖండిస్తోంది. హుండీ ఆదాయం గణనీయంగా తగ్గిన కరోనా కాలంలోనూ, సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణ ద్వారా టిటిడి ఆదాయం పెరిగింది. శ్రీవారి భక్తులు ఇలాంటి కుట్రపూరిత తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి. టిటిడి వివిధ బ్యాంకుల్లో చేసే నగదు, బంగారు డిపాజిట్లు అత్యంత పారదర్శకంగా జరుగుతాయి.
పెట్టుబడులపై స్టేటస్ నోట్..!
1. టిటిడి నియమ నిబంధనల ప్రకారం, మిగులు మొత్తాలను ఏ బ్యాంకు ఎక్కువ వడ్డీ ఇవ్వడానికి ముందుకొస్తుందో అలాంటి షెడ్యూల్డ్ బ్యాంకుల్లో మాత్రమే పెట్టుబడి పెడుతున్నారు.
2. బ్యాంకుల్లో నగదు, బంగారం డిపాజిట్ చేయడానికి టిటిడి బోర్డు ఆమోదించిన పెట్టుబడి మార్గదర్శకాల ప్రకారం అర్హతగల షెడ్యూల్డ్ బ్యాంక్‌లు, సంస్థల నుండి టిటిడి కొటేషన్లను ఆహ్వానిస్తుంది. ప్రభుత్వంచే ఆమోదించబడిన ప్రైవేట్ రంగ బ్యాంకులు కొటేషన్లు సమర్పించే అర్హత పొందడానికి అత్యధిక క్రెడిట్ రేటింగ్‌ను కలిగి ఉండాలి. ఆర్.బి.ఐ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ప్రాసెస్ (PCA)లో భాగమైన బ్యాంకులు కొటేషన్లలో పాల్గొనడానికి ఆహ్వానించబడవు.
3. కేంద్ర ప్రభుత్వ లేదా రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టకూడదని టిటిడి బోర్డు ఇప్పటికే తీర్మానించింది. ఈ ప్రకారం కేంద్ర / రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడులు పెట్టడం లేదు.
4. శ్రీవారి హుండీ ద్వారా స్వీకరించబడిన బంగారు కానుకలు 12 సంవత్సరాల దీర్ఘకాలిక బంగారు డిపాజిట్లలో గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ కింద కరిగించడం, శుద్ధి చేయడం మరియు పెట్టుబడి పెట్టడం కోసం భారత ప్రభుత్వ మింట్‌కు పంపబడుతున్నాయి.
5. ట్రస్ట్ విరాళాలకు సంబంధించి “బ్యాంకులు సేకరించిన విరాళాలు” ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం అదే బ్యాంకుల్లో పెట్టుబడి పెడుతున్నారు.
6. నాణేల తరలింపు టిటిడికి, బ్యాంకులకు చాలా కష్టమైన పని. కాబట్టి పరకామణిలో నాణేలను సేకరించే బ్యాంకులు ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం అవే బ్యాంకుల్లో పెట్టుబడి పెడుతున్నారు.
7. 30.06.2019 మరియు 30.09.2022 నాటికి పెట్టుబడులు (బ్యాంక్ వారీగా డిపాజిట్లు) జతచేయబడ్డాయి.