ఆస్ట్రేలియా ఆటగాడు మాట్ రెన్ షా రాయల్ లండన్ వన్డే కప్‌లో సోమర్ సెట్ తరపున ప్రాతినిద్యం వహిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా బుధవారం సర్రేతో జరిగిన మ్యాచ్‌లో రెన్ షా సంచలన క్యాచ్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచాడు.
సర్రే ఇన్నింగ్స్ ఆరో ఓవర్ వేసిన ఆల్డ్రిడ్జ్ బౌలింగ్‌లో.. బ్యాటర్ ర్యాన్ పటేల్ ఢిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి ఎడ్జ్ తీసుకుని సెకెండ్ స్లిప్ దిశగా వెళ్లింది.
ఈ క్రమంలో సెకెండ్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రెన్ షా డైవ్ చేస్తూ సింగిల్ హ్యాండ్‌తో అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో బ్యాటర్‌తో పాటు ప్రేక్షకులు కూడా ఒక్కసారిగా షాక్‌కు గురియ్యారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో సర్రే 43 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన సర్రే నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది.
సర్రే బ్యాటర్లు నికో రైఫర్(70),షెరిడాన్ గంబ్స్(66) పరుగులతో రాణించారు. అనంతరం 303 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సోమర్‌సెట్‌కు వరుణుడు ఆటంకం కలిగించాడు. మ్యాచ్ నిలిపోయే సమయానికి సోమర్‌సెట్12 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 68 పరుగులు చేసింది. అయితే ఎప్పటికీ వర్షం తగ్గుముఖం పట్టకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో సర్రేను విజేతగా నిర్ణయించారు.