బెంగళూరు: దక్షిణాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి చెందిన కీలక నేత.. వెంకయ్య నాయుడు. ప్రాంతీయ పార్టీల హవా బాగా ఉండే దక్షిణాదిలో దశాబ్దాల కాలం పాటు బీజేపీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారాయన.

ఏపీ సహా కేంద్ర రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా, కేంద్రమంత్రిగా కీలక హోదాల్లో పని చేశారు. ఉప రాష్ట్రపతి అత్యుత్తమ బాధ్యతలను నిర్వర్తించారు. ఉప రాష్ట్రపతిగా వెళ్లాల్సి వచ్చినందున- రాజకీయాలకూ దూరం అయ్యారు.

ఉప రాష్ట్రపతిగా వెళ్లడంతో..
 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర మంత్రివర్గంలో కీలక శాఖలకు ప్రాతినిథ్యాన్ని వహించారు. కర్ణాటక, రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు పలుమార్లు ఎన్నికయ్యారు. బీజేపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో రాజ్యసభలో తన వాగ్ధాటితో అధికార పక్షాన్ని చాలా సందర్భాల్లో ఇరుకున పెట్టారు. కేంద్ర మంత్రివర్గంలో కొనసాగుతున్న సమయంలో ప్రధాని మోడీ- ఆయనను ఎవ్వరూ ఊహించని విధంగా ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేశారు.

సేవలు వినియోగించుకోవాలనుకున్నా..

ఉప రాష్ట్రపతిగా వెంకయ్య నాయుడి కాల పరిమితి ముగియడం, ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోవడం వల్ల దక్షిణాదిలో బీజేపీ పెద్ద దిక్కును కోల్పోయినట్టయింది. కర్ణాటక మినహాయిస్తే- మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ బలహీనంగా ఉండటం వల్ల వెంకయ్య నాయుడి సేవలను నరేంద్ర మోడీ- అమిత్ షా మరో రకంగా పార్టీ కోసం వినియోగించుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ.. అది సాధ్యపడలేదు. దక్షిణాదిలో బీజేపీని బలోపేతం చేయడానికి ఆయన సూచనలు, సలహాలను బీజేపీ హైకమాండ్ తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

వెంకయ్య వారసుడిగా..

దక్షిణాదిలో వెంకయ్య నాయుడు లేని లోటును భర్తీ చేసుకోవడంపై బీజేపీ హైకమాండ్ దృష్టి సారించింది. ఆయన స్థానంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పకు ప్రాధాన్యత ఇస్తోంది. ఏకంగా యడియూరప్పను పార్లమెంటరీ బోర్డులోకి తీసుకుంది. బీజేపీలో అత్యున్నత కార్యవర్గం ఏదైనా ఉందంటే అది పార్లమెంటరీ బోర్డే. అందులోకి యడియూరప్పను తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అదొక్కటే కాకుండా పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీలోనూ బీఎస్‌వైకి చోటు కల్పించింది.

ఆ ఖాళీలు భర్తీ..

చాలాకాలంగా పార్లమెంటరీ బోర్డులో అయిదు ఖాళీలు ఉంటూ వస్తోన్నాయి. దివంగత నేతలు అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్, అనంత్‌ కుమార్‌తో పాటు ఉప రాష్ట్రపతిగా వెళ్లడం వల్ల వెంకయ్య నాయుడు, కర్ణాటక గవర్నర్‌గా వెళ్లడం వల్ల తావర్‌చంద్ గెహ్లాట్ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని బీజేపీ అధిష్ఠానం భర్తీ చేసింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను తప్పించింది.

దక్షిణాదిలో బలమైన నేతగా..

కర్ణాటకలో బీజేపీకి బలమైన నాయకుడు యడియూరప్ప. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సారథ్యంలోని కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని కుప్పకూల్చడంలో కీలక పాత్ర పోషించారు. ఆపరేషన్ లోటస్‌ను విజయవంతం చేశారు. ఈ రెండు పార్టీలకు చెందిన 17 మంది ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్పించగలిగారు. దక్షిణాది రాష్ట్రాల్లో తొలిసారిగా బీజేపీ అధికారంలోకి వచ్చిందంటే అది యడియూరప్ప మంత్రాంగమే కారణం.

వెంకయ్య సలహా?

అలాంటి నాయకుడిని పిలిచి మరీ అత్యున్నత పదవిని అప్పగించింది బీజేపీ అధిష్ఠానం. గతంలో ఇదే కర్ణాటక నుంచి వెంకయ్య నాయుడు రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించారు. అప్పటి నుంచీ వెంకయ్య నాయుడు-యడియూరప్ప మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. యడియూరప్పను పార్టీ అత్యున్నత కమిటీల్లోకి తీసుకోవడంలో వెంకయ్య నాయుడి సలహాలు కూడా ఉండొచ్చనే అభిప్రాయాలు కర్ణాటక రాజకీయాల్లో వ్యక్తమౌతోన్నాయి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *