CM Jagan:ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి..
సంక్షేమ పథకాలను నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. కరోనా కారణంగా ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయినా.. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా.. అనుకున్న సమయానికి పేదల ఖాతాల్లో నగదు జమ చేస్తూనే ఉన్నారు.
ఈ ఏడాది ఇప్పటికే పలు సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధి దారుల ఖాతాల్లోకి నగదు జమ చేసిన.. సీఎం.. ఇప్పుడు మరో పథకం కింద నగదు పంపిణీకి కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 23వ తేదీన కృష్ణా జిల్లా పెడనలో సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు.
అర్హులు ఎవరు..?
ఈ పథకం కోసం ఇప్పటికే నేతన్నల నుంచి దరఖాస్తులు స్వీకరించి.. లబ్ధిదారుల జాబితాలను సచివాలయాలకు పంపించారు. సొంత మగ్గం ఉన్న బిలో పావర్టీ లైన్ కుటుంబాలకు చెందిన వారికి ఈ పథకం కింద ఏటా 24 వేలు రూపాయలు జమ చేస్తున్నారు. పెడన నియోజకవర్గం పరిధిలో 3,161 మంది వైఎస్ఆర్ నేతన్న నేస్తం లబ్దిదారులు ఉన్నారు. వారందరూ సభకు రానున్నారు.
మచిలీపట్నం, గుడ్లవల్లేరు, పెడన నుంచి పెద్ద ఎత్తున నేత కార్మికులను ఈ బహిరంగ సభకు తరలించేలా వైసీపీ నేతలు ఏర్పాట్లు చేశారు. మరోవైపు పెడనలో వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద డబ్బులు జమ చేసిన తరువాత.. తోటమూలలో ఏర్పాటు కానున్న బహిరంగ సభను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగిస్తారు.
మచిలీపట్నం నుంచి పార్లమెంటరీ నియోజకవర్గం కేంద్రంగా కృష్ణా జిల్లా ఏర్పాటైన తరువాత సీఎం జగన్ పర్యటించడం ఇదే తొలిసారి. ఇప్పటికే సీఎం జగన్ పర్యటన, బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లపై గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ నేతన్నకు ఆపన్న హస్తం అందించేలా వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం అమలు చేస్తున్నారు. ఈ ఏడాది వైఎస్సార్ నేతన్న నేస్తం కింద అర్హులైన 80,032 మంది నేతన్నలకు 192.08 కోట్లను వర్చువల్ విధానంలో కంప్యూటర్ బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు.
మగ్గం కలిగిన, అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి ఏటా 24,000 చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోంది. ఐదేళ్లలో ప్రతి లబ్ధిదారుడికి రూ.1,20,000 చొప్పున ఆర్థిక సాయం అందనుంది. ఇప్పటికే 3 విడతల్లో సాయం అందగా తాజాగా నాలుగో విడత సాయాన్ని అందచేయడం ద్వారా అర్హులైన ప్రతి నేతన్నకు 96,000 చొప్పున ప్రయోజనం చేకూరనుంది.
దేశ చరిత్రలోనే తొలిసారిగా చేనేత కుటుంబాలకు పారదర్శకంగా లబ్ధి చేకూర్చేలా వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సచివాలయాల్లో దరఖాస్తు చేసుకున్న వెంటనే వలంటీర్ల సహకారంతో నిర్దిష్ట కాలపరిమితితో తనిఖీ పూర్తి చేసి అర్హుల జాబితాలను సచివాలయాల్లో ప్రదర్శించడం ద్వారా సోషల్ ఆడిట్ చేపట్టింది
ఒకవేళ ఎక్కడైనా అర్హులకు ప్రభుత్వ పథకాలు ఏ కారణం చేతనైనా అందకపోతే వారికి ఒక నెల రోజుల పాటు గడువిచ్చి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. వెంటనే ఆ దరఖాస్తులను పరిశీలించి అర్హులైతే సాయం అందేలా చర్యలు చేపట్టింది. ఏ ఒక్క అర్హుడికీ అన్యాయం జరగకూడదనే తపనతో ఆర్థిక సాయం అందించేలా ఏర్పాట్లు చేసింది.
ఈ ఆర్థిక సాయాన్ని బ్యాంకులు పాత అప్పుల కింద జమ చేసుకోరాదని ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసి నేతన్నలు గౌరవప్రదంగా జీవించేలా ఆపన్న హస్తం అందిస్తోంది. అర్హులందరికీ నగదు అందుతుందని.. అయితే వారం రోజులలోపు అందరి ఖాతాలో నగదు జమ అవుతుందని.. ఒకవేళ ఎవరికైనా నగదు జమ కాకపోతే.. గ్రామ లేదు వార్డు సచివాలయాల్లో ఫిర్యాదు చేయొచ్చన్నారు.