B6NEWS….
కనిష్ఠంగా 75 గజాల స్థలం ఉన్నవారికి చాన్స్
తెల్ల రేషన్ కార్డు ఉండాలి.. మహిళల పేరిటే కట్టాలి
గతంలో ప్రభుత్వ లబ్ధి పొంది ఉంటే వారు అనర్హులు
నియోజకవర్గానికి వెయ్యి మందికి చొప్పున అవకాశం
‘డబుల్ బెడ్‌రూం’ ఫలాలు అందని ఊర్లకు ప్రాధాన్యం
ఈ నెల 10న క్యాబినెట్ సమావేశం తర్వాత ప్రకటన
సొంత జాగా ఉన్న వారికి ఇల్లు కట్టుకునేందుకు ప్రభుత్వం ప్రకటించిన రూ. 3 లక్షల ఆర్థిక సాయానికి నిబంధనలు ఖరారయ్యాయి. ఇలా ఇళ్ల నిర్మాణం చేసుకునేందుకు లబ్ధిదారుల అర్హతలు, ప్రామాణికాలు, అనర్హతలు.. ఇలా పలు అంశాలపై భారీ కసరత్తు చేసిన అధికార యంత్రాంగం.. నిబంధనలను రూపొందించింది. ఈ నెల 10న ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో జరగనున్న క్యాబినెట్ భేటీలో ఈ పథకంపై చర్చించనున్నారు. ఆ వెంటనే ప్రభుత్వం ఈ పథకంపై ప్రకటన చేయన్నుట్లు సమాచారం. సొంత జాగా ఉన్న పేదలకు ఇళ్ల నిర్మాణానికి రూ. 3 లక్షల సాయాన్ని అందించే పథకాన్ని 15 రోజుల్లో ప్రారంభిస్తామని ఇటీవలి మహబూబ్‌నగర్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రకటన చేసిన నేపథ్యంలో.. అధికారులు ఆగమేఘాల మీద నిబందనలను ఖరారు చేశారు.
ఇవీ నిబంధనలు..
సొంత జాగా ఉండి.. తెల్ల రేషన్ కార్డు ఉన్న పేదలే అర్హులు
విడతల వారీగా మొత్తం రూ.3లక్షల సాయాన్ని అందజేస్తారు
డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం జరగని గ్రామాలకు తొలి ప్రాధాన్యం
ఇంటి నిర్మాణానికి కనిష్ఠంగా 75 గజాల స్థలం ఉండాలి
మహిళ పేరిటే ఈ సాయాన్ని అందిస్తారు.
తహసీల్దార్, ఎంపీడీవోలు లబ్ధిదారులను గుర్తిస్తే కలెక్టర్ ఆమోదిస్తారు.అయితే.. ఎమ్మెల్యేలు,మంత్రుల పరిశీలన తర్వాతే ఎంపిక జరుగుతుంది
గతంలో ఇందిరమ్మ ఇళ్లు పొందినవారు ఈ పథకానికి అనర్హులు
అనర్హులను ఏరివేసేందుకు.. ఇప్పటికే ఆన్‌లైన్‌లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వివరాలను పరిశీలిస్తారు.
ఎస్సీ, ఎస్టీలు.. ఇతరులు..అందరికీ రూ. 3 లక్షలే..!
అందరికీ డబుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మించి ఇవ్వడానికి భారీగా స్థలసేకరణ చేయాల్సి ఉంటుంది. అన్ని చోట్లా ఇది సాధ్యం కాదు. అందుకే.. సొంత జాగా ఉన్నవారికి ఆర్థిక సాయం చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీనిపై గతంలో పలుమార్లు ప్రకటనలు చేశారు. అప్పట్లో నియోజకవర్గానికి మూడు వేల మందిని ఈ పథకంలో లబ్ధిదారులుగా గుర్తించాలని, ఒక్కొక్కరికి రూ.5లక్షల సాయం చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.12వేల కోట్ల మేర అంచనాలను ప్రకటించారు. ఎస్సీ ఎస్టీలకు కొంత సాయం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా.. లబ్ధిదారుల సంఖ్యను నియోజకవర్గానికి వెయ్యికి(మొదటి విడత).. ఆర్థిక సాయాన్ని ఎస్సీ, ఎస్టీలు.. ఇతరులఅందరికీ రూ.3లక్షలకు కుదించారు. కాగా, రాష్ట్రంలో కిరాయి(అద్దె) ఇళ్లలో ఉంటున్న వారి సంఖ్య 30 లక్షలకు పైనే ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. 2015లో ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో 24.58 లక్షల మంది అద్దె ఇళ్లలో ఉన్నట్లు తేలింది. ఇప్పుడు ఆ సంఖ్య 30 లక్షలకు పైనే ఉంటుందని అధికారులు చెబుతున్నారు.