కేజీఎఫ్‌ (KGF).., దీని పేరు తెలియని భారతీయుడు లేడు అనడంలో అతిశయోక్తి లేదు.

డైరక్షర్‌ ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel), హీరో యష్‌ (Yash) సృష్టించిన కలెక్షన్స్‌ల విధ్వంసం అంతా ఇంతా కాదు.. ఆ సినిమా ప్రభావం చాలామందిపై పడింది. అసలు ఈ కేజీఎఫ్‌ అంటే ఏంటి? ఇదంతా నిజమేనా అంటూ నెట్‌లో గంటల తరబడి వెతికారు. ఇప్పుడు ఇదే కేజీఎఫ్‌ని రాష్ట్ర ఆర్థిక భారం తగ్గించుకునేందుకు వాడుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ సర్కారు కొత్త ప్రణాళికలు రచిస్తోంది. అదేంటి ఈ కేజీఎఫ్‌తో రాష్ట్ర ఆర్థిక భారం తగ్గించే శక్తి ఉందా అనుకుంటున్నారా? అయితే మీకు అసలు విషయం తెలియాల్సిందే..! ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన దేశంలో బంగారానికి క్రేజ్‌ ఉంటుంది. అయితే అత్యధికంగా బంగారాన్ని ఉత్పత్తి చేసే దేశంగా చైనా అగ్రస్థానంలో ఉంది. అయితే మన చుట్టూ ఉన్న ప్రదేశాల్లో కోలార్ గోల్డ్ ఫీల్డ్ చరిత్రను కెజిఎఫ్ సినిమాలో చూశాం. అందులో బంగారం తవ్వకాల కోసం జరిగిన యాక్షన్‌ సీన్లు చూస్తేనే మనకు అర్థం అవుతుంది. కేజీఎఫ్‌లో ఎంతటి విలువైన బంగారం ఉంటుందో. అయితే గత కొన్నేళ్లుగా మరుగున పడిన ఏపీ కేజిఎఫ్‌కు.., త్వరలోనే పూర్వ వైభవం రాబోతుంది.

కుప్పం గోల్డ్ ఫీల్డ్స్ చరిత్ర..!

ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడి సొంత నియోజకవర్గం కుప్పంలోని గుడుపల్లె మండలంలో రెండు బంగారు గనులు ఉన్నాయి. అపారమైన బంగారు నిక్షేపాలు మట్టిలో కలసి భూమి పొరల్లో ఇమిడిపోయి ఉన్నాయి. 1968లో ఈ బిసానత్తం గనిని గుర్తించారు. ఆ తర్వాత దశాబ్దం తరువాత చిగురుకుంట గనిని 1978లో ఎంఈసీఎల్‌ సంస్థ బంగారు వెలికితీసే పనులు చేపట్టింది. ఈ సంస్థ పదేళ్లపాటు క్వార్జ్‌ (బంగారు ముడి పదార్థం) వెలికి తీసి బీజీఎంఎల్‌ (భారత్‌ గోల్డ్‌ మైనింగ్‌ లిమిటెడ్‌)కు అందిస్తూ వచ్చింది.

కొన్ని అనివార్య కారణాలవల్ల ఎంఈసీఎల్‌ సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. కార్మికులకు సరైన వేతనాలు ఇచ్చే పరిస్థితులు లేకపోవడంతో… ఈ రెండు గనులను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీజీఎంఎల్‌ 1982లో కొనుగోలు చేసింది. కేంద్రప్రభుత్వ సంస్థ ఇక్కడ బంగారాన్ని వెలికితీయం మొదలుపెట్టినప్పటి నుంచి లాభాల బాటలో పయనించింది. అంతేకాదు ఆనాటి నుంచి 19 ఏళ్ల పాటు అంటే 15 జనవరి 2001 వరకు బంగారు ముడి ఖనిజం వెలికి తీసే పనిని చేపట్టింది.

కుప్పంలోని ఈ గనులు లాభాల్లోకి రావడంతో.., కేజీఎఫ్‌లోని బీజీఎంఎల్‌ నిర్వహిస్తున్న ఛాంపియన్‌ గని నష్టాల్లోకి వెళ్లింది. అయితే ఇది కేవలం కొంత మంది స్వార్థపరులు చిగురుకుంట, బిసానత్తం గనులు నష్టాల్లో సాగుతున్నట్లు తప్పుడు లెక్కలు చూపించడంతో లాక్‌అవుట్‌ అయ్యాయనే ప్రచారం ఇప్పటికీ కొనసాగుతుంది. అప్పటి సీఎంగా ఉన్న చంద్రబాబు… తన సొంత నియోజకవర్గంలో గనులు మూత పడుతున్నా చూస్తూ ఉండటం తప్ప ఏమి చేయలేక పోయారు. ఈ గనులు మూతపడటంతో ఇందులో పనులు చేసే వందలాది మంది కూలీలు రోడ్డున పడ్డారు.

మూతపడిన పదేళ్ల తర్వాత మళ్లీ..!

పదేళ్ల తరువాత అంటే 2011లో.. ఇక్కడ బంగారు కోసం అన్వేషణ చేయాలని మైసూరుకు చెందిన జియో సంస్థను కేంద్రప్రభుత్వం ఆదేశించింది. వెంటనే జియో సంస్థ మల్లప్పకొండ, బిసానత్తం, చిగురుకుంటలోని 19 కిలోమీటర్ల మేర పరిశోధనలు చేసింది. దాదాపు 260 హెక్టార్లను ఎంపిక చేసి 150 బోర్లు డ్రిల్‌ చేసి బంగారం నిక్షేపాలపై అన్వేషణ మొదలుపెట్టింది. ఇక్కడ దొరికిన సల్ఫేట్‌ మట్టిని బెంగళూరుకు పంపించి ల్యాబ్‌లో పరీక్షలు చేయగా.. చిగురుకుంట, బిసానత్తం ప్రాంతాల్లో ఇంకా బంగారు ఖనిజాలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అధికారులు ఆ నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి అందజేశారు.

ఆధారంగా బిడ్‌లకు ఆహ్వానం పలికింది. ఈ బిడ్‌లకు ఆదాని, వేదాంత వంటి బడా బడా కంపెనీలు సైతం పోటీ పడ్డాయి. అయితే ఈ పోటీలో ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఎన్‌ఎండీసీ టెండర్లను దక్కించుకుంది. ఇంక కేవలం రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు ఇస్తే చాల.., తవ్వకాలు మొదలుపెట్టడమే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గుడ్‌ న్యూస్ చెప్పారు. వచ్చే ఏడాది లోపు గనుల్లో తవ్వకాలు ప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఉద్యోగ-ఉపాధి అవకాశాలు..!

ఈ గనుల తవ్వకాలు ప్రారంభిస్తే. స్థానికులకు ఉపాధితో పాటు అక్కడి గ్రామ పంచాయతీలకు ఆదాయం వస్తుందని ప్రభుత్వం ఆలోచన. గనులు లాక్‌ అవుట్‌ చేసే నాటికి 1500 మంది పని చేసే కార్మికులు రోడ్డున్న పడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో చిగురుకుంట, బిసానత్తం ప్రాంతాల్లో గనులు సాగాలంటే 3 వేల మంది సిబ్బంది అవసరమవుతుంది. వీరిలో 1500 గని కార్మికులు మరో 1500 నిపుణులు, ఉద్యోగులు అవసరం అవుతారు. ఒక్కసారి ఇక్కడ తవ్వకాలు ప్రారంభం అయితే స్థానికులకు భారీగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది.

అప్పట్లో ఓఎన్‌ కొత్తూరు పంచాయతీకి నెలకు లక్షల్లో ఆదాయం వచ్చేదని కార్మికులు తెలిపారు. ఇప్పటి పరిస్థితుల్లో ఆదాయం నాలుగింతలు అయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే పారదర్శకతతో నిధులు వినియోగిస్తే రెండు పంచాయతీల అభివృద్ధితో పాటు కుప్పం నియోజకవర్గానికి మహర్దశ వచ్చినట్లే అని స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు..

పదేళ్ల తర్వాత పనిచేయనున్న మెషినరీ..!

గతంలో తవ్వకాలు ఆపడం వల్ల .. గనుల వద్ద ఉన్న జనరేటర్లు, ట్యాంకర్లు, లిఫ్టులు, మోటార్లు పూర్తిగా తుప్పు పట్టిపోయాయి. తవ్వకాలు ప్రారంభిస్తే పరికరాలు వినియోగంలోకి వచ్చి కోట్ల రూపాయలు ఆదా కానుంది. ఈ రెండు గనుల ప్రాంతాల్లో 8 సొరంగ మార్గాలు ఉండగా, ఇందులో రెండు మార్గాలు బంగారు ముడి ఖనిజం బయటికి తీయడానికి, మిగతా 6 కార్మికుల రాకపోకలు, వ్యర్థాలు బయటికి తీయడానికి వినియోగించనున్నారు. సొరంగాలకు వినియోగించే భారీ టవర్లు వినియోగంలోకి రానున్నాయి.

దాదాపు 263 హెక్టార్లలో విస్తరించిన చిగురుకుంట, బిసానత్తం గనుల్లో ఇప్పటికీ 18 లక్షల టన్నుల బంగారం ముడి ఖనిజం ఉండవచ్చని అధికారుల అంచనా వేస్తున్నారు. ఒక టన్ను ముడి పదార్థం నుంచి 5.5 గ్రాముల బంగారం వస్తుంది. మొత్తం 8.5 టన్నుల బంగారం ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుని, రూ.450 కోట్ల వరకు సంస్థ ఇన్వెస్ట్‌ చేయనుంది. అంతేకాదు ఆ ప్రాంతంలోనే బంగారు శుద్ధి ప్లాంటుకు సన్నాహాలు ప్రారంభించింది. ఏళ్ల నిరీక్షణ తర్వాత మొదలుకానున్నీ ప్రాజెక్ట్‌ కానీ పూర్తి అయితే …కుప్పంకు మహర్దశ పెట్టినట్లే అని స్థానికులు సంబరపడుతున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *