స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్బంగా తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులకు ప్రదర్శిస్తున్న గాంధీ సినిమా ప్రదర్శనపై దేశంలోని పలు రాష్ట్రాల ఉన్నతాధికారులు ఆసక్తి చూపి ఈ ప్రదర్శన విధానంపై తెలుసుకుంటున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదేశాలకనుగుణంగా రాష్ట్రంలోని 552 సినిమా హాళ్ళద్వారా దాదాపు 20 లక్షలకు పైగా విద్యార్థులకు గాంధీ సినిమా ఉచితంగా ప్రదర్శిస్తున్నారు. ఇంత పెద్ద స్థాయిలో ఉచితంగా ప్రదర్శించడం దేశంలోనే ఇది మొదటిసారి.
గాంధీ సినిమా ప్రదర్శనకు తెలంగాణ రాష్ట్రం నుండి అద్భుతమైన స్పందన రావడంతో, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ మరియు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు గాంధీ చిత్రప్రదర్శన ఏర్పాటు చేసిన తీరుపై రాష్ట్ర ప్రభుత్వ అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం రెండు వారాల పాటు అంటే ఆగస్ట్ 8 నుండి 22 ఆగస్టు వరకు నిర్వహిస్తున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిని చాటిచెప్పే పక్షం రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు, గాంధీ సినిమా ప్రదర్శన, బుక్ ఫెయిర్ నిర్వహించడం, ఫొటో ఎగ్జిబిషన్ వంటి అనేక ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా నేటి తరం పిల్లలను స్వాతంత్య్ర పోరాటంపై చైతన్యవంతం చేసేందుకు జాతిపిత మహాత్మాగాంధీ బయోపిక్‌ను ప్రదర్శించాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించగా, తెలంగాణ ప్రభుత్వం గాంధీ సినిమా ఉచిత ప్రదర్శనను ప్రారంభించింది. రోజుకు 2.50 లక్షల మంది విద్యార్థులకు గాంధీ చిత్రాన్ని ప్రదర్శించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దాదాపు 20 లక్షల మంది స్కూలుకు వెళ్లే పిల్లలు సినిమా చూస్తున్నారు. పాఠశాలకు వెళ్లే పిల్లల్లో దేశభక్తిని పెంపొందించేందుకు జాతిపిత జీవిత చరిత్ర ఆధారంగా గాంధీ చిత్రాన్ని ఆగస్టు 09 నుండి 11 వరకు మరియు ఆగస్టు 16 నుండి 21వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 552 థియేటర్లలో ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1.15 గంటల వరకు ప్రదర్శస్తున్నారు. ఈ చిత్రం హిందీ, ఇంగ్లీష్ వెర్షన్‌లలో ప్రదర్శించబడుతుందని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి MAUD మరియు కమిషనర్, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ అరవింద్ కుమార్ తెలియజేసారు.