బాలికలను లైంగిక వేధింపులకు గురి చేసిన, భువనగిరి పట్టణం లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ గుర్తింపు రద్దుచేసి యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా పేరెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కొడారి వెంకటేష్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్, జిల్లా పోలీసు అధికారి, జిల్లా బాలల పరిరక్షణ కమిటీ కి ఆయన వేరువేరుగా వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా కొడారి వెంకటేష్ మాట్లాడుతూ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ యాజమాన్యం బాలల హక్కులకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించడం, బాలికలను లైంగిక వేధింపులకు గురి చేయడం పరిపాటిగా మారిందని ఆయన అన్నారు. గతంలో చౌటుప్పల్ మండల కేంద్రము లో ఇలాంటి దుచ్చర్యలకు పాల్పడిన, కృష్ణవేణి టాలెంట్ స్కూల్ కరస్పాండెంట్ ప్రజల చేతిలో దెబ్బలు తిన్నారని ఆయన గుర్తు చేశారు. భువనగిరి కృష్ణవేణి టాలెంట్ స్కూల్ గుర్తింపు రద్దుచేసి, విద్యార్థులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, కరస్పాండెంట్ పై పోక్సో కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి నెల మూడవ శనివారం జరగాల్సిన పేరెంట్స్, టీచర్స్ మీట్ లో కేవలం పదవతరగతి పేరెంట్స్ తో మాత్రమే సమావేశం జరిపించడం, కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో పనిచేస్తున్న టీచర్లను కూడా లైంగిక వేధింపులకు గురిచేయడం, విద్యార్థుల వాష్ రూమ్ లోని దృశ్యం అగుపించే విధంగా సీ సీ కెమెరాలు ఏర్పాటు చేసి, చూడడం, ఆలస్యంగా పాఠశాలకు వచ్చిన విద్యార్థులను విపరీతంగా కొట్టడం లాంటి చర్యలకు పాల్పడుతున్న కరస్పాండెంట్ రఘు వెంకట సురేష్ పై పోక్సో కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.